Sunday 16 March 2014

వినియోగదారులు హక్కులను వినియోగించుకోవాలి FACA

వినియోగదారుల హక్కుల కమిషన్‌ రాష్ట్ర అధ్యక్షులు తమడ గోపాల కృష్ణ 
    
            రాజ్యాంగంలోని చట్టాలను ప్రజలు వినియోగించుకోవాలని వినియోగదారుల హక్కుల కమిషన్‌ రాష్ట్ర అధ్యక్షులు న్యాయమూర్తి తమడ గోపాల కృష్ణ అన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డికొమరయ్య హాల్‌లో శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐలు, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌, ఫాకా, ఐద్వా సంయుక్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తులు అనంతసెన్‌ రావ్‌, సింహాచలం, చంద్రశేఖర్‌ రెడ్డిలు పాల్గొన్నారు. ఐలు నగర ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గోపాల కృష్ణ మాట్లాడుతూ ప్రతి మనిషి వినియోగదారుడేనని అన్నారు. వినియోగదారుడు తమ హక్కులను తెలుసుకుని, వాటి కోసం కృషి చేస్తే మంచి సమాజం వస్తుందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో వినియోగదారులకు సమస్యలు ఎక్కువగా ఉన్నా వినియోగదారుల కోర్టులకు రావడం లేదని అన్నారు. వినియోగదారుల చట్టాలు ప్రజలకు అనుకూలమైనవని, ప్రజలు వీటిని ఉపయోగించుకోవడం లేదని అన్నారు. దీనికి ప్రజలకు ఈ చట్టాల గురించి తెలియకపోవడమే కారణమని అన్నారు. దీనికి తోడు తెలిసిన వారికి చైతన్యం లేకపోవడం మరో కారణమని పేర్కొన్నారు. వస్తువుల కొనుగోలులో జరిగే మోసాలు, నాణ్యతాలోపాలు, అపార్ట్‌ మెంట్‌ భవనాల కొనుగోలు, నిర్మాణంలో జరుగుతున్న మోసాలను చూసి రక్షణ పొందేందుకు వినియోగదారుల పోరం సేవలను వినియోగించుకోవాలని, తాము సహకరిస్తామని తెలిపారు. ప్రపంచంలో మొదటగా అమెరికాలో ఈ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. 1952లో వినియోగ దారుల హక్కులపై మొదటి సదస్సు జరిగిందని వివరించారు.
                     1983 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినంగా ప్రకటించారని అప్పటి నుంచి ప్రతి ఏడాది మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. మన దేశంలో 1986లో వినియోగదారుల హక్కుల చట్టం దేశంలో వచ్చిందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలకు వినియోగదారుల చట్టం గురించి వివరించేందుకు తాము సిద్ధమని తెలిపారు. సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వినియోగదారులకు చట్టాలపై అవగాహనా సదస్సులు నిర్వహించాలని కోరారు. ప్రతి పౌరుడు ఓ వినియోగదారుడేనని అన్నారు. హాస్పిటల్‌, చికిత్స, మందుల వాడకం, నిత్యా‌వ‌స‌ర‌ వస్తువులు, ఎరువులు, వాటి నాణ్యత ధరలు.. వీటిలో వచ్చే సమస్యలపై చట్టాన్ని ఆశ్రయించవచ్చని వివరించారు. వాహనాల కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన సమస్యలను వినియోగదారులకు వివరించారు. పత్రి హోటల్‌లోనూ స‌ర్వీ‌స్ ట్యా‌క్స్‌ వేయ‌డం లేద‌ని, కేవలం ప్రభుత్వం నుంచి ట్యా‌క్స్‌ వసూలు చేసుకోవచ్చనే అనుమతి ఉన్న వాటికే ఈ అవకాశముందని తెలిపారు. అనంతరం ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు సంఘటనలను వివరిస్తూ వినియోగదారులకు లబ్ధి ఏ విధంగా చేకురిందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐలు నగర అధ్యక్షులు రాంచంద్రరెడ్డి, ఫాకా నగర ప్రధాన కార్యదర్శి కామేష్‌ బాబు, జిహెచ్‌ఆర్‌ఎఫ్‌ నగర ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, ఐద్వా నగర కార్యదర్శి ఆశాలత, జిల్లా వినియోగదారుల సంఘాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు టివి రాజేశ్వర్‌ రావు, నాయకులు అరుణ జ్యోతి, ధశరత్‌, బషీర్‌తో పాటు ఆయా సంఘాల కార్యకర్తలు, వినియోగదారులు పాల్గొన్నారు. 
-ప్రజాశక్తి